-అంబేద్కర్ విగ్రహానికి నివాళులు… 24 గంటల దీక్షకు శ్రీకారం…
-డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాటం ఉధృతం…
హుజురాబాద్, ఏప్రిల్ 07 (మా అక్షరం):హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం మరింత వేగం అందుకుంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శ్రీకారం చుట్టారు. దీక్ష ప్రారంభానికి ముందు ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుని నిరాహార దీక్షలో కూర్చున్నారు.ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు కోసం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మహిళలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలు దీక్షా స్థలాన్ని నింపివేసి ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావం తెలుపడానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ వచ్చి సంఘీభావం తెలిపారు. అలాగే జేఏసీ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుతో ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ప్రజల ఐక్యతతో ఈ ఉద్యమం విజయవంతం అవుతుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి డంపింగ్ యార్డు నిర్ణయాన్ని రద్దు చేయాలని జేఏసీ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.













