హుజురాబాద్ /మే 01( మా అక్షరం): హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల పద్మశాలి సంఘాలు వేస్ట్ టు ఎనర్జీ డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును ప్రభుత్వం అనుమతితో ఏర్పాటు చేస్తే డంపింగ్ యార్డ్ ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు మే 2వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు హుజురాబాద్ చేనేత సహకార సంఘం వద్ద నుండి ఊరేగింపును ప్రారంభించనున్నారు. “డంపింగ్ యార్డ్ వద్దు – ప్రజల ప్రాణాలు ముద్దు”, “డంపింగ్ యార్డ్ హటావో – హుజురాబాద్ బచావో” వంటి నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.అక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షా శిబిరంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పాల్గొంటారు. అనంతరం మళ్లీ ఊరేగింపుగా బయలుదేరి ఎమ్మార్వోకు అర్జీ, మెమోరాండం సమర్పించనున్నారు.ఈ కార్యక్రమానికి మండలంలోని పద్మశాలి సంఘాల ప్రతినిధులు, కులబాంధవులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు.













