-అవగాహన సదస్సులో ఏసీపీ మాధవి సూచన…
హుజూరాబాద్/జూన్ 22 ( మా అక్షరం): మత్తు పదార్థాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు సోమవారం హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మత్తు పదార్థాల అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తారని, వారి ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు.ప్రతి విద్యార్థి జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని, చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల పరిసరాల్లో మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మత్తుకు దూరంగా, చదువుకు దగ్గరగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ
కార్యక్రమంలో పట్టణ సీఐ కరుణాకర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.













