హుజురాబాద్/ ఆగస్టు 14 (మా అక్షరం):హుజురాబాద్ నియోజకవర్గంలోని చేనేత సహకార సంఘాల పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధి బృందం గురువారం పర్యటించింది.హుజురాబాద్ చేనేత సహకార సంఘాన్ని ప్రతినిధి బృందం సందర్శించింది. అక్కడ పనిచేస్తున్న చేనేత కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, కార్యవర్గ సభ్యులు సంఘం పరిస్థితులను వివరించారు. టెస్కో నుంచి సుమారు రూ.90 లక్షల పేమెంట్ రావాల్సి ఉందని తెలిపారు. టెండర్ విధానంలో ఉత్పత్తి చేసిన వస్త్రాల్లో చాలా వరకు విక్రయాలు జరగక నిల్వలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. నేతన్నలకు అంత్యోదయ కార్డులు, పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం రాంపూర్ చేనేత సహకార సంఘాన్ని ప్రతినిధి బృందం సందర్శించింది. సంఘం అధ్యక్షుడు ముషం వెంకట నారాయణ, గ్రామ సర్పంచ్ ముషం సంగీత-గణేశ్, సంఘం సభ్యులు ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. తమ సమస్యలను వినతిపత్రం రూపంలో రాపోలు వీరమోహన్‌కు అందజేసి సన్మానించారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం శాలపల్లి గ్రామంలోని నేతన్న విగ్రహానికి రాపోలు వీరమోహన్ పూల మాలలు వేసి నివాళులర్పించారు. జమ్మికుంటలోని మూడు చేనేత సహకార సంఘాల నాయకులు ప్రతినిధి బృందానికి ఘన స్వాగతం పలికి పద్మశాలి భవన్‌కు తీసుకెళ్లారు. అంతకుముందు వివిధ చేనేత సహకార సంఘాల్లో మగ్గాలను పరిశీలించిన రాపోలు వీరమోహన్, ఉత్పత్తి అవుతున్న వస్త్రాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.తదుపరి పద్మశాలి భవన్‌లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు చేనేత నాయకులు ప్రసంగించారు. అనంతరం రాపోలు వీరమోహన్ చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సంఘాల పరిస్థితులు, వస్త్ర నిల్వలు, ఉపాధి అవకాశాలు, క్యాష్ క్రెడిట్, టెస్కో నుంచి రావాల్సిన చెల్లింపులు తదితర అంశాలపై సుదీర్ఘంగా వివరించారు. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ పర్యటనలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు గుజ్జ తార, ఉపాధ్యక్షురాలు వేముల ఉమారాణి, బింగి రాణి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్, రాష్ట్ర కమిటీ కార్యదర్శులు కుడికాల సాయి, దుస్స శ్రీనివాస్, జడల అశోక్, రాష్ట్ర పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ అరికెల వీరేశలింగం, స్థానిక పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ కే. వీరస్వామి, జమ్మికుంటకు చెందిన రాష్ట్ర కార్యదర్శి గాజుల అరుణ తదితరులు పాల్గొన్నారు.













