హుజురాబాద్/ సెప్టెంబర్ 27 (మా అక్షరం):తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ పితామహుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో క్రాస్ రోడ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్యుడిగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి బిడ్డగా జన్మించడం సమాజానికి గర్వకారణమన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన స్వాతంత్ర్య సమరయోధులకు న్యాయపరంగా అండగా నిలిచారని తెలిపారు.చేనేత, సహకార రంగాల అభివృద్ధికి బాపూజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు.1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన త్యాగమూర్తి అని కొనియాడారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమానికి మద్దతుగా ఆమరణ దీక్ష చేపట్టారని గుర్తుచేశారు.కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని పద్మశాలి యువత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వేముల యాదగిరి, విడప రాజు, మంద రమేష్, సంగెం ఐలయ్య, చిలుకమారి శ్రీనివాస్, సబ్బని రాజేందర్, కడవెరుగు సత్యం,కుడికాల భాస్కర్, సంగెం భాస్కర్, కొండా గణేష్, మండల యాదగిరి, జర్నలిస్ట్ కుడికాల సాయి, ఇప్పలపల్లి చంద్రశేఖర్,మంద బిక్షపతి,ఆడెపు సూర్యం, తౌటం శ్రీహరి, మండల శేకరయ్య, గంజి జయవర్ధన్, సంగెం శ్రీనివాస్, (చిక్స్) సంగెం శ్రీనివాస్, (మెడికల్), గాలి సమ్మయ్యతో పాటు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.













