-అలైన్‌మెంట్ మార్చి శాశ్వత నిర్మాణాలు.. చెరువుకు చేరని ఎస్సారెస్పీ నీరు…
-ఆక్రమణలు తొలగించి, మురుగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో ఫిర్యాదు…
హుజురాబాద్/అక్టోబర్ 26 (మా అక్షరం): పట్టణంలోని గుండ్ల చెరువుకు నీరందించే ఎస్సారెస్పీ ఉపకాలువ ఆక్రమణలకు గురికావడంతో చెరువుకు సాగునీరు చేరడం లేదని గుండ్ల చెరువు రక్షణ సమితి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువ ఆక్రమణలను తొలగించి, చెరువుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుండ్ల చెరువు కింద వందల ఎకరాల ఆయకట్టు ఉందని,చేపల పెంపకంపై ఆధారపడి సుమారు 250 ముదిరాజ్ కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని నాయకులు తెలిపారు. ఎస్సారెస్పీ నుంచి చెరువుకు నీరందించే 16ఏ ఉపకాలువను పలుచోట్ల ఆక్రమించడంతో పాటు,కాలువ అలైన్‌మెంట్‌ను మార్చి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. దీంతో చెరువుకు చేరాల్సిన సాగునీరు చిలుకవాగులోకి వెళ్తోందని పేర్కొన్నారు.
మురుగునీటితో కలుషితమవుతున్న కాలువ
మరోవైపు, పట్టణంలోని పలు వార్డుల నుంచి వెలువడుతున్న మురుగునీరు ఇదే కాలువలోకి చేరుతుండటంతో నీరు కలుషితమై దుర్వాసన వెదజల్లుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల కాలువ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఆక్రమణలు తొలగించి కాలువను పునరుద్ధరించాలి
రెవెన్యూ నక్షా ఆధారంగా సమగ్ర సర్వే నిర్వహించి, కాలువను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆక్రమణలను తొలగించి పూర్వపు స్థితికి పునరుద్ధరించాలని అధికారులను కోరారు. కాలువలోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ నిర్మించాలని, ఎస్సారెస్పీ ద్వారా వచ్చే సాగునీటిని గుండ్ల చెరువుకు మళ్లించి రైతులకు, మత్స్యకార కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గుండ్ల చెరువు రక్షణ సమితి నాయకులు సాయికృష్ణ, అభినయ్, పసుల స్వామి, రైతులు క్యాస రమేష్, కొలిపాక చిన్న, దేవుని సమ్మయ్య, రాజు, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.













