-ఘనంగా సంస్మరణ సైకిల్ ర్యాలీ.. జెండా ఊపి ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని…
హుజూరాబాద్/అక్టోబర్26( మా అక్షరం): ప్రజల రక్షణ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం హుజూరాబాద్ పట్టణంలో పోలీసుల ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ రంగాపూర్ గ్రామం మీదుగా సాగి తిరిగి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ ర్యాలీ ప్రజల్లో భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు యువతకు సేవాభావాన్ని చాటి చెప్పారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి: ఏసీపీ మాధవి
ఈ సందర్భంగా ఏసీపీ వాసంశెట్టి మాధవి మాట్లాడుతూ, సమాజ రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగనిరతి ఎప్పటికీ మరువలేనివని కొనియాడారు. అమరవీరులను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.దేశం, ప్రజల భద్రత కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన అమరవీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యువత చట్టాలను గౌరవిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
పోలీసుల సేవలు వెలకట్టలేనివి: మున్సిపల్ చైర్‌పర్సన్
మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబాలను ప్రభుత్వం, సమాజం ఎల్లప్పుడూ ఆదుకోవాలని అన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ టి.కరుణాకర్,రూరల్ సీఐ వీరభత్తిని శ్రీనివాస్,రామకృష్ణ గౌడ్, పులి వెంకట్ గౌడ్, ఎస్సైలు కొత్తపల్లి రవి, కట్కూరు శేఖర్ రెడ్డి, ఆవుల తిరుపతి, స్వాతి, క్రాంతి, ఏఎస్సై కమల, మున్సిపల్ కౌన్సిలర్లు సొల్లు సునీత, కోయల్‌కార్ భారతి, భాస్కర్, తాళ్లపల్లి రమేష్, సర్పంచ్ కట్కూరు మల్లారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.













