– వైద్య సేవలు, మందుల లభ్యతపై అధికారుల ఆరా…
– 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించాలని ఆదేశం…
– ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేయించుకోవాలి…
హుజూరాబాద్ / నవంబర్ 12( మా అక్షరం):జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజగోపాలరావు గురువారం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని ఫ్యామిలీ వెల్ఫేర్ యూనిట్, ఎన్‌సీడీ యూనిట్, ఆరోగ్యశ్రీ యూనిట్లను సందర్శించి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.మధుమేహం,రక్తపోటు బాధితులందరికీ అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, తగినంత ఇన్సులిన్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.14 సంవత్సరాలు నిండిన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా అందించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని,రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పొందిన ఆసుపత్రులు గడువు ముగిసేలోపు రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు.అదేవిధంగా స్కానింగ్ సెంటర్లలో నిబంధనల ప్రకారం అర్హత కలిగిన రేడియాలజిస్టులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో అర్హత కలిగిన పాథాలజిస్టులు విధులు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కృష్ణప్రసాద్, పీపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ పాండురంగారెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సదానందం,జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్, డీఎంహెచ్‌ఓ సహాయకులు మతిన్, ఎంపీహెచ్‌ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు













