-వంద పడకల ఆసుపత్రికిలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను కేటాయించండి..
-ఆసుపత్రి పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే ఆందోళన తప్పదు..
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్/ ఆగస్టు06(మా అక్షరం): పట్టణంలోని 100 పడకల ఆసుపత్రి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కళకళలాడిందని నేడు వెలవెలపోతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజురాబాద్ లోని వంద పడకల ఆసుపత్రి సందర్శనలో భాగంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఉద్దేశంతో కేసిఆర్ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను అత్యాధునిక పరికరాలను తీసుకొచ్చి పునరుద్ధరించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజురాబాద్ ఆసుపత్రిలో ఆరుగురు గైనకాలజిస్ట్ లు ఉండేవారని, నెలకు దాదాపు 200కు పైగా డెలివరీలు జరిగేవని అన్నారు. ప్రస్తుతం హుజురాబాద్ ఆసుపత్రిలో ఒకే ఒక గైనకాలజిస్ట్ ఉందని నెలకు 60 నుంచి 70 మాత్రమే డెలివరీలు జరుగుతున్నాయని అన్నారు. వెంటనే గతంలో మాదిరిగా హుజురాబాద్ కు ఆరుగురు గైనకాలజిస్ట్లతోపాటు జమ్మికుంటకు ఇద్దరినీ కేటాయించాలన్నారు. అలాగే ఆర్థోపెడిక్ గతంలో ఇద్దరు ఉంటే ఇప్పుడు ఒక్కరు కూడా లేరని, జనరల్ సర్జన్ ను ఇద్దరు ఉండే ఇప్పుడు లేరని, ఈఎన్టీ కూడా లేరని, అనస్తీసియా 5 ఉండేవారని ప్రస్తుతం ఇద్దరే ఉన్నారని, ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేస్తే హుజురాబాద్ ఆసుపత్రి ఎలా నడుస్తుందో చెప్పాలన్నారు. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి చొరవ తీసుకొని హుజురాబాద్ ఆసుపత్రికి అవసరమయ్యే డాక్టర్లతో పాటు సిబ్బందిని కేటాయించాలని అన్నారు. హుజురాబాద్ ఆసుపత్రిలో చుట్టుపక్కల మండలాల నుంచి కూడా చాలామంది వైద్యం కోసం వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఐసియూ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని వెంటనే దానిని ప్రారంభించాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గర్భిణీ స్త్రీలకు ఎలాగైతే న్యూట్రిషన్ కిట్టు తో పాటు డెలివరీ జరిగిన తర్వాత ఆడబిడ్డ పుడితే 13000 మగ బిడ్డకు జన్మనిస్తే 12000 ఇచ్చారు అదేవిధంగా ఇవ్వాలని ఆయన సూచించారు. కెసిఆర్ కిట్ పేరు పెట్టడం ఇష్టం లేకపోతే పేరు మార్చుకోనైనా సరే గర్భిణీ స్త్రీలకు ఈ పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు. కరీంనగర్ ఇన్చార్జి మినిస్టర్ ఉత్తంకుమార్ రెడ్డి తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ బాబులు ఒకసారి ప్రభుత్వాసుపత్రికి వచ్చి ఇక్కడ పరిస్థితులపై ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి గర్భిణీ స్త్రీలతో సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలని నేను పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధికా, శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.











