-హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు..
-ఆస్తి కోసమే తల్లిదండ్రులతో కలిసి అన్నను చంపిన తమ్ముడు…
హుజురాబాద్/అక్టోబర్ 05 (మా అక్షరం): మండలంలోని రాజపల్లి గ్రామంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకెళ్తే హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30) శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. రాజును పథకం ప్రకారమే హత్య చేసిన తమ్ముడు అంజి తో పాటు తల్లిదండ్రులు నోముల చంద్రయ్య ఎల్లమ్మ లను శనివారం సాయంత్రం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాజు విగతజీవిగా పడి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జి, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి.. నోముల రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు. మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో కొట్టిన గాయాలు ఉన్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉన్నాయి. కర్రతో గాయపరిచి చంపి ఉంటారని పోలీసులు గుర్తించారు.అనంతరం పోలీసులు మృతుని తల్లిదండ్రులు, సోదరుడు అంజిలను హుజురాబాద్ లో అదుపులోకి తీసుకొని విచారించగా తన అన్నని ఆస్తి కోసమే చంపినట్లు అంజి ఒప్పుకున్నాడు.గత కొంతకాలంగా అంజి, రాజుల మధ్య వారి తల్లిదండ్రులు సంపాదించిన పొలం కోసం ఘర్షణలు జరుగుతున్నాయని విచారణలో తేలింది. అంజి చెడు వ్యసనాలకు బానిసై విపరీతంగా అప్పులు చేయడంతో పాటు పొలం తనకు ఇవ్వాలంటూ రాజు తో తరచూ గొడవలు జరిగేవని ఇదే క్రమంలో అన్నను హత్య చేస్తే ఆస్తంతా తనదే అవుతుందని ఆలోచనతో హైదరాబాదు నుంచి ఇటీవలే రాజ పల్లి కి వచ్చిన అంజి తన తల్లిదండ్రులతో హత్యకు కుట్ర పన్నాడు. పథకం ప్రకారమే ముగ్గురు కలిసి శనివారం అర్ధరాత్రి రాజు తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కర్రతో తల పై బాది హత్య చేశారని నిందితులు విచారణలో ఒప్పుకున్నట్లు ఏసిపి తెలిపారు. హత్య జరిగిన గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకోవడంతో పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు.











