-కేసీఆర్ ని విమర్శించే స్థాయి ఈటల కు లేదు..
-రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ కాదా….
-అవినీతి తో అక్రమంగా సంపాదిస్తే
తన్ని పార్టీ నుంచి వెల్లగొట్టారు…
-హుజురాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా…
-బీజేపీ లోకి వెళ్లిన ప్రతి ఒక్కరు బిఆరెస్ లోకి వాపస్ రావాలి..
-హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి…
హుజురాబాద్ జూలై 22( మా అక్షరం): ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని టికెట్ ఇచ్చి అన్నం పెట్టిన కేసీఆర్ తో పాటు హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కార్యకర్తలతో పాటు మోసం చేశాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం హుజురాబాద్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్ ది కేసీఆర్ ను విమర్శించే స్థాయి కాదని, కెసిఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు కేసీఆర్ ని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ఈటలకు రాజకీయ బిక్ష పెట్టి రెండు సార్లు మంత్రిగా చేసిన కేసీఆర్ ను విమర్శించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే అవుతుందని అన్నారు. దేవుడు లాంటి కేసీఆర్ ను విమర్శిస్తే పుట్టగతులు ఉండవని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో ఉన్నప్పుడు లేని బీసీల మీద ప్రేమ ఇప్పుడు కొత్తగా ఎలా పుట్టిందని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్ పార్టీలో ఉండి పార్టీకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలనుకున్న నీ ఆశలను బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిప్పి కొట్టారని అన్నారు. పేద ప్రజల నెత్తుటి రక్తాన్ని పీల్చి వందల ఎకరాలు కబ్జా చేస్తే దానిని సహించని కెసిఆర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కొడుకు బిడ్డ పేర్లు పక్కన రెడ్డి అని పెట్టుకున్న నీవు బీసీ ఎలా అయితావని ఆయన ప్రశ్నించారు. కమలాపూర్ లో ఉన్న ఈటెల బంధువులను ఏనాడైనా హైదరాబాద్ కు తీసుకువెళ్లి కనీసం అన్నం పెట్టావా అంటూ ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ బిసి ముసుగులో ఉన్న దొర అని అన్నారు. గుడ్లు అమ్ముకునే స్థాయి నుంచి బంగారు గుడ్లు అమ్ముకునే స్థాయి వరకు ఎలా ఎదిగారని ఆయన అన్నారు. నీకు హుజురాబాద్ గడ్డ బిక్ష పెడితే షామీర్పేట్ గడ్డ నాది అని ఎలా అంటావాని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో నాటి టిఆర్ఎస్ కార్యకర్తలను మభ్యపెట్టి తన వెంట తిప్పుకొని ఇప్పుడు షామీర్పేట్ కి వెళ్లి వాళ్లను నట్టేట ముంచారని అన్నారు. ఈటెల వెంట వెళ్లిన టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధైర్య పడవద్దని టీఆర్ఎస్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని, ఈటలను నమ్ముకొని మోసపోయిన వారంతా తిరిగివస్తే వారికి ఎప్పుడు ఆహ్వానం పలికేందుకు హుజురాబాద్ నియోజకవర్గం లో నేను సిద్ధంగా ఉంటానని అన్నారు. ఈటల రాజేందర్ బిఆర్ఎస్ కార్యకర్తల జోలికి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. ఈటల రాజేందర్ పార్టీలో చేరక ముందే మా నాన్న సాయినాథ్ రెడ్డి, కెప్టెన్ లక్ష్మీ కాంతారావు హుజురాబాద్ నియోజకవర్గం లో అన్ని స్థానాలు గెలిపించాలని గుర్తు చేశారు. హుజురాబాద్ గడ్డ ఎప్పటికీ కెసిఆర్ అడ్డాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న గ్రామపంచాయతీ మున్సిపల్ అన్ని ఎన్నికలలో హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి పోటీలో టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి తీరుతానని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో వెళితే నన్ను బిజెపిలో కలుస్తానంటూ మాట్లాడటం సిగ్గుచేటు అని అన్నారు. అలా అయితే ఇటీవల ఈటెల రాజేందర్ బట్టి విక్రమార్కతో ఒక ఫంక్షన్కు వెళ్లారని అక్కడ దిగిన ఫోటో తను అఫీషియల్ అకౌంట్లో పోస్ట్ చేశారని అలా అయితే ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్లో చేరుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ ట్రాప్ లో కౌశిక్ రెడ్డి పడ్డారని ఈటెల మాట్లాడుతున్నారని బండి సంజయ్ ట్రాప్ లో పడింది నేను కాదని ఈటలనేనని అన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని కొన్ని గ్రామాలకు 25 వేల చొప్పున పంపించి తన ఇంటి ముందు ధర్నా చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టుమని 200 మంది కూడా వెళ్లలేదని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఈటెల రాజేందర్ ను ఎప్పుడో మర్చిపోయిందని, ఇక హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ కి ఎలాంటి మద్దతు దొరకదని విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ఘాటుగా స్పందించారు. హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు రెండో విడత వెంటనే అమలు చేయాలని, సుమారు 40000 మంది ఇంద్ర మహిళ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారని వారందరికీ వెంటనే ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హుజురాబాద్ లో పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు వదిలిపెట్టేదే లేదని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బి ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రావు, ఎంపీపీలు రాణిసురేందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, కన్నురి సత్యనారాయణరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధిక శ్రీనివాస్, రాజేశ్వరరావు తక్కలపల్లి, సంగేమ్ ఐలయ్య, రంజిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.











