వల్బాపూర్‌లో శ్రీకృష్ణుని పల్లకి సేవ అంగరంగ వైభవంగా
ఎల్కతుర్తి/ఆగస్టు 17 (మా అక్షరం):ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వల్బాపూర్ గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి, హిందూ జ్ఞాన వేదిక ఎల్కతుర్తి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ పశుపతినాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి ప్రతిమను కొలువు తీర్చగా, మరుసటి రోజు గ్రామంలో భక్తుల అంతా కలిసి పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పురవీధుల గుండా సాగిన ఈ ఊరేగింపులో భక్తులు కోలాటాలు, ఆటపాటలు, సన్నాయి వాయిద్యాలతో పాల్గొని “జయజయ ధ్వానాలు”, భగవద్గీత శ్లోక నినాదాలతో ఆలయ వాతావరణాన్ని మారుమోగించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు నిరంజన్ సిద్ధాంతి ఆయనకు శాలువాతో సత్కారం చేశారు. ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, “శ్రీకృష్ణుని ఊరేగింపులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి విశ్వాసాలను పెంపొందిస్తాయి” అని అన్నారు.ఈ వేడుకలో రైతు సంరక్షణ సమితి హనుమకొండ–కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇంగే భాస్కర్ కూడా పాల్గొని, కమిటీ సభ్యుల చేతుల మీదుగా శాలువాతో సత్కారం అందుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులందరికీ అన్నదానం, తీర్థప్రసాదాలు అందజేశారు.
త్రైత సిద్ధాంతం ఉత్సవ కమిటీ అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, “భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా జీవాత్మ–ఆత్మ–పరమాత్మల విశిష్టతను వివరించారు. భగవంతుడే మనిషిగా అవతరించాడని, శ్రీకృష్ణ పరమాత్మను దైవంగా ఆరాధించాలనే సందేశాన్ని ప్రజలకు చేరువ చేయడమే ఈ ఊరేగింపులో ముఖ్య ఉద్దేశం” అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రబోధా సేవా సమితి సభ్యులు శివ నారాయణ సింగ్, వెంకట్, కీర్తన, సాకేత్, రేవతి, కల్పన, రాణి, శ్రీలత, స్రవంతి, అనూష, దివిజ, క్షేత్రజ్ఞ, మోక్షజ్ఞ, ఋషి, భవిజ్ఞ, సంతోష్, సతీష్ చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ శివాలయ కమిటీ చైర్మన్ గంజి భావన ఋషి, సభ్యులు రామ్ రావు, లక్ష్మణరావు, రత్నాకర్ రావు, యాదగిరి, నవీన్, అనంతరాములు, చక్రపాణి, మహేందర్, గణేష్, కుమార్ తదితరులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.











