ఘనంగా రాంపూర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
హుజురాబాద్/ డిసెంబర్ 25 (మా అక్షరం): ప్రతి సంవత్సరం మాదిరిగానే రాంపూర్ కల్వర్ టెంపుల్ చర్చిలో రెవరెండ్ డాక్టర్ పి.ఆర్. నెల్సన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జన్మదినం సందర్బంగా ఉదయం నుంచే క్రైస్తవులు నూతన వస్త్రాలతో, భక్తిశ్రద్ధలతో చర్చిలో పాల్గొన్నారు. పిల్లల నాట్యాలు, యూత్ స్కిట్స్, క్రీస్తు పుట్టిన నాటికలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాంపూర్ సర్పంచ్ ముశం సంగీత గణేష్, రంగాపూర్ సర్పంచ్ కుంట అరుణ తిరుపతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రిస్మస్ రోజు చర్చిలో గడపడం ఎంతో ఆనందంగా ఉందని, క్రీస్తు పుట్టుక సమాజానికి మేలు చేసిందని వారు పేర్కొన్నారు. బైబిల్ ప్రవచనాలు సత్ప్రవర్తనకు దోహదం చేస్తాయని తెలిపారు.చర్చ్ ఫాదర్ నెల్సన్ మాట్లాడుతూ డిసెంబర్ 25ను ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు పుట్టినరోజుగా జరుపుకుంటారని, క్రైస్తవ్యం ఒక మతం కాదని మంచితనానికి మార్గమని చెప్పారు. బైబిల్ మహాఙ్ఞాన గ్రంథమని ఆయన వివరించారు.ఈ సందర్భంగా బొడ్డు రాజరత్నం కమల కుటుంబం ఆధ్వర్యంలో 15 మంది పేదలకు సర్పంచుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. వార్డ్ మెంబర్‌గా గెలిచిన బండ మాధవి రమేష్‌ను సంఘ సభ్యులు సన్మానించారు.ఫాదర్ నెల్సన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడుతూ సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు ఫాదర్ నెల్సన్ దంపతులను సన్మానించారు. అనంతరం అతిథులు, చర్చ్ సభ్యులు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు.అందరికీ క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు.











