-అభివృద్ధి కోరితే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలి…
-ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….
హుజురాబాద్/ ఫిబ్రవరి 07 (మా అక్షరం):హుజురాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్‌ఎస్ పార్టీకే ప్రజలు ఓటు వేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం రాత్రి పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్, సూపర్ బజార్ చౌరస్తా, ఇందిరానగర్ చౌరస్తాలలో నిర్వహించిన కార్నర్ మీటింగ్స్‌లో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిజాయితీగా, కష్టపడి పనిచేసే వారికే పట్టం కట్టాలని, కొత్తవారైనా పాతవారైనా పనితీరే ప్రమాణంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ, గద్దెనెక్కిన తర్వాత వాటిని పక్కన పెట్టిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. పాలనా వైఫల్యాల కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడ్డదని, ముఖ్యమంత్రి వాడే భాష రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తోందన్నారు.హుజురాబాద్ మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో భాగస్వాములై పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు.హుజురాబాద్ మున్సిపాలిటీలో తిరిగి గులాబీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోరెడ్డి శంతన్ రెడ్డి ,చందా గాంధీ, మల్లారెడ్డి, వార్డు అభ్యర్థులు తలకొక్కుల శ్యామల, వెన్నంపల్లి లావణ్య, మొలుగురు సృజన, ముక్క రమేష్, పుల్లూరి శారద తదితరులు పాల్గొన్నారు.











