హుజురాబాద్/ఏప్రిల్ 11: మహాత్మా జ్యోతిరావు పూలే 200 వ జయంతి సందర్భంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పూలే బహుజన చైతన్యానికి స్ఫూర్తి, మహిళల విద్యకు దీపస్తంభమని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలనకు బీజం వేసిన సామాజిక విప్లవయోధుడిగా, సత్యశోధక సమాజ స్థాపకుడిగా ఆయన సేవలు చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు.మహిళల చదువు పాపంగా భావించిన కాలంలో పూలే సమాజాన్ని సవాల్ చేస్తూ విద్యకు శ్రీకారం చుట్టారని, మహిళల స్వాభిమానం, స్వేచ్ఛ, గౌరవానికి మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు. ఒక మహిళ చదువుకుంటే సమాజం మొత్తం మారుతుందని పూలే నమ్మకం నేడు నిజమైందని అన్నారు.ఈ లక్ష్యంతోనే తన భార్య సావిత్రిబాయి పూలేను చదివించి దేశంలోని తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలబెట్టారని గుర్తుచేశారు. బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించి విద్యను హక్కుగా అందించిన మహోన్నతుడు పూలేనని అన్నారు.
అలాగే, పూలే సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్న బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని పేర్కొన్నారు.ప్రస్తుతం చదువుకుంటున్న ప్రతి మహిళ వెనుక పూలే దంపతుల త్యాగం, సంకల్పం ఉందని, ఒకప్పుడు పాఠశాలలకు వెళ్లలేని బాలికలు నేడు డాక్టర్లు, ఇంజనీర్లు, నాయకులుగా ఎదగడం వారి కృషి ఫలితమని అన్నారు.
ముందుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని పూలేకు నివాళులు అర్పించారు.కరీంనగర్‌లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి రైతుల మహాగర్జన సమరభేరి సభకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కవితను ఆహ్వానించగా, ఆమె సానుకూలంగా స్పందించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నవీనా చారి, నవీన్ రెడ్డి, పుస్కూరి శ్రీకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.













