-డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర — రేపు ప్రజలంతా పాల్గొనాలి…
హుజురాబాద్/ ఏప్రిల్ 22 (మా అక్షరం):మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ (వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్) నిర్మించేందుకు ప్రతిపాదించిన డంపింగ్ యార్డు రద్దు చేయాలనే డిమాండ్‌తో స్థానిక ప్రజల్లో ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామం నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర, సిర్సపల్లి గ్రామం మీదుగా సాగి, హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ముగియనుంది. ఈ పాదయాత్రకు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులకు పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెత్త నిల్వల కారణంగా భూగర్భ జలాలు కలుషితం కావడం, పంటలు నష్టపోవడం, పశువులకు ఇబ్బందులు తలెత్తడం, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపారు.ఈ నేపథ్యంలో హుజురాబాద్ మండలం, పట్టణం, జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట, కమలాపూర్ మండలాలకు చెందిన ప్రజలు, రైతులు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాలని కోరారు.ప్రజల ఆరోగ్యం, రైతుల భవిష్యత్తు, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.












