– భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు…
హుజూరాబాద్/ ఆగస్టు 17 (మా అక్షరం):హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో నాగ పంచమి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాస నాగ పంచమిని పురస్కరించుకుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది.వేకువజామున ఆలయ ప్రధాన అర్చకులు పందిళ్ల భాస్కర్ శర్మ ఆధ్వర్యంలో నాగేంద్ర స్వామికి పవిత్ర నదీజలాలు, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి పుట్టను పుష్పాలు, విద్యుత్ దీపాలతో అలంకరించారు. హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు తరలివచ్చి పుట్టలో పాలు పోసి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు.కుటుంబ ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, సర్పదోష నివారణ కోసం భక్తులు ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. చిమ్మిలి, చలిమిడి, వడపప్పు తదితర నైవేద్యాలను సమర్పించి మంగళహారతులు ఇచ్చారు.భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల నిర్వహణ, మంచినీటి సదుపాయం, ప్రసాద వితరణను క్రమబద్ధంగా చేపట్టారు. రోజంతా ఆలయ ప్రాంగణం ‘‘ఓం నాగేంద్ర స్వామినే నమః’’ నామస్మరణతో మారుమోగింది.ఆలయాన్ని దర్శించుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులను ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర్ శర్మ ఘనంగా సత్కరించారు. నాగ పంచమి వేడుకలతో కొత్తపల్లి ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.













