-కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన దళిత, ప్రజా సంఘాల నాయకులు…
హుజురాబాద్/ ఆగస్టు 17 (మా అక్షరం): పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం చుట్టూ రాజకీయ పార్టీలు, నాయకులు సభలు, సమావేశాల సందర్భంగా ప్లెక్సీలు, జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ దళిత, ప్రజా సంఘాల నాయకులు సోమవారం మున్సిపల్ కమిషనర్ బి.కిషన్ కు వినతిపత్రం అందజేశారు.అంబేద్కర్ విగ్రహం చుట్టూ ప్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేయడం వల్ల విగ్రహం కనిపించకుండా పోతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని నాయకులు పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశ ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారని, ఆయన ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా వ్యక్తికి చెందినవారు కాదన్నారు.రాజకీయ పార్టీల ప్రచార ప్లెక్సీలు, జెండాలు, తోరణాలు ఏర్పాటు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తునికి సమ్మయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి, ఎం.ఐ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రత్నం, ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య, ఆర్టీసీ జేఏసీ నాయకుడు వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.













