– బీసీ జె ఏ సి నాయకులు చందుపట్ల జనార్ధన్…
-ఏడో రోజుకు చేరిన జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు..
-అంబేద్కర్ చౌరస్తాలో అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన…
హుజురాబాద్/ఆగస్టు 22(మా అక్షరం):అర్హులైన జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించి వారికి న్యాయం చేయాలని, కోర్టులో వేసిన అక్రమ కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి, కాంగ్రెస్ నాయకుడు గూడూరు స్వామి రెడ్డి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నినదిస్తూ నిరసన గళం విప్పారు.జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై స్వామిరెడ్డి వేసిన పిటిషన్‌ను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని,అడ్డంకులు సృష్టించే కుట్రలను మానుకోవాలని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టుల న్యాయమైన హక్కుల సాధనకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈ దీక్షా శిబిరాన్ని బీసీ జేఏసీ గౌరవాధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ సందర్శించి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ హితం కోసం నిరంతరం శ్రమించే జర్నలిస్టుల కలం కదిలినా, గళం గర్జించినా ఆ సమన్వయ శక్తిని ఏ శక్తీ తట్టుకోలేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తే విలేకరులు నేడు తమ కనీస హక్కుల కోసం రోడ్డెక్కడం ప్రజాస్వామ్యానికే అవమానకరమన్నారు.సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని,బయట విమర్శలు చేసుకోకుండా అధికారిక వేదికలపై చర్చించి తక్షణ పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు. గతంలో జటిలమైన డంప్‌యార్డ్ సమస్యను ప్రజాప్రతినిధులు సమష్టిగా ఎలాగైతే పరిష్కరించారో, అదే తరహాలోనే జర్నలిస్టుల స్థలాల సమస్యను కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి వెంటనే కొలిక్కి తేవాలని డిమాండ్ చేశారు. స్థలాల కేటాయింపులో ఏవైనా చిన్నచిన్న సాంకేతిక లోపాలుంటే జర్నలిస్టులే సరిదిద్దుకుంటారని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేంత వరకు బీసీ జేఏసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి వీరస్వామి, మండల కార్యదర్శి కోయల్ కార్ దుర్గాజి, ప్రొఫెసర్ తడకమళ్ళ శేఖర్, బీసీ జేఏ సి అధ్యక్షులు సందెల వెంకన్న,ఇప్పకాయల సాగర్,మామునూరి ప్రవీణ్, దేవసాని ప్రియదర్శిని, సంఘం సత్యనారాయణ, పంజాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని జర్నలిస్టుల పోరాటానికి తమ మద్దతు ప్రకటించారు. అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు.













