-నలుగురు అరెస్ట్.. మరో ఐదుగురు పరారీ…
హుజురాబాద్/అక్టోబర్ 01 (మా అక్షరం):హుజురాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులో ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద సెప్టెంబర్ 27న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్‌పల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేష్ (30) మృతదేహం సెప్టెంబర్ 28న ఎస్ఆర్ఎస్పీ కాలువలో లభ్యమైంది. మృతుడి తల్లి వడిగే దేవక్క ఫిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించడంతో పాటు సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డీటెయిల్స్‌ను పరిశీలించారు.దర్యాప్తులో రాకేష్‌కు A1 అమరగొండ ప్రశాంత్ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గతంలో ఇద్దరి మధ్య వివాదాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పాత కక్షల నేపథ్యంలో ప్రశాంత్ రాకేష్‌ను హత్య చేసేందుకు పథకం రూపొందించినట్లు తెలిపారు. A2 రాజ్‌కుమార్‌తో పాటు మరికొందరిని కలుపుకొని హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.పథకం ప్రకారం రాజ్‌కుమార్ రాకేష్‌తో పరిచయం పెంచుకుని ఎల్కతుర్తికి రప్పించి, సెప్టెంబర్ 27న హుజురాబాద్‌కు తీసుకువచ్చాడు.అనంతరం మద్యం సేవించిన తర్వాత పెద్దపాపయ్యపల్లి శివారులోని ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్దకు తీసుకెళ్లగా, అక్కడికి చేరుకున్న నిందితులు రాకేష్‌పై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ప్రశాంత్ రాకేష్ గొంతుపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడవేసి నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు.విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబర్ 1న ఎల్కతుర్తిలోని ఓ అద్దె ఇంటిపై పోలీసులు దాడి చేసి A1 అమరగొండ ప్రశాంత్, A2 రాజ్‌కుమార్, A3 అమరగుండ రిత్విక్, A4 తుమ్ముల అఖిల్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.A5 టి. అఖిల్, A6 రాహుల్, A7 బి. చందు, A8 బి. అజయ్, A9 గణేష్ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులను వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది













