హుజురాబాద్/ అక్టోబర్ 08 (మా అక్షరం):హుజురాబాద్ సమ్మక్క–సారలమ్మ జాతరలో గత 30 ఏళ్లుగా కోయ పూజారిగా సేవలందించిన చెన్నమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందారు. గత ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తన స్వగ్రామమైన గోవిందరావుపేటలో తుదిశ్వాస విడిచారు.చెన్నమ్మ స్వగ్రామం గోవిందరావుపేట. ప్రతి ఏడాది సమ్మక్కను తీసుకువచ్చే పవిత్ర కార్యక్రమంలో భాగంగా గత 30 సంవత్సరాలుగా ఆమె హుజురాబాద్కు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. రంగనాయకుల గుట్ట సమీపంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరలోనూ కోయ పూజారిగా ప్రత్యేక సేవలందిస్తూ భక్తులకు అర్చనలు నిర్వహించారు.సమ్మక్కను తీసుకువచ్చే కార్యక్రమంలో చెన్నమ్మకు ప్రత్యేక స్థానం ఉండేది. జాతర సమయంలో ఆమె నిర్వహించే పూజలు, అర్చనలు భక్తుల్లో ప్రత్యేక విశ్వాసాన్ని కలిగించాయి. మూడు దశాబ్దాలుగా నిరంతరంగా సమ్మక్క–సారలమ్మ సేవలో కొనసాగిన ఆమె మృతి స్థానిక భక్తులను తీవ్రంగా కలిచివేసింది.చెన్నమ్మ మృతితో సమ్మక్క–సారలమ్మ భక్తులు, స్థానికులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.













