-కందుగులలో.. బొడ్డెమ్మ నిమజ్జనం..
హుజురాబాద్/ అక్టోబర్ 09(మా అక్షరం):మండలంలోని కందుగుల గ్రామంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకురాలు కంకణాల సరోజన ఆధ్వర్యంలో బొడ్డెమ్మ నిమజ్జనోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగను నిర్వహించుకోవడం ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే బతుకమ్మను అన్ని గ్రామాల్లో వాడవాడలా నిర్వహించుకుంటుండగా బొడ్డెమ్మను మాత్రం కొన్నిచోట్ల మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. భాద్రపద పంచమి రోజు ప్రారంభం అయ్యే బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగ ముందు రోజు ముగుస్తుంది. పుట్ట మన్నుతో బొడ్డెమ్మను తయారుచేసి తొమ్మిది రోజులు పూజిస్తారు. సాయంత్రం పూట బొడ్డెమ్మ ఆడతారు. పాటలను పాడుతారు. ముఖ్యంగా వివాహం కాని యువతులు వివాహం జరగాలని, మంచి భర్త రావాలని భక్తి శ్రద్ధలతో దీన్ని నిర్వహిస్తారు. అలాగే మహిళలు దీర్ఘ సుమంగళిగా ఉండాలని బొడ్డెమ్మని కోరుకుంటారు. ఈ పండుగకు ప్రకృతితోనూ అనుబంధం ఉంది రంగురంగుల పూలతో అమ్మవారిని పూజిస్తారు. కందుగులలో నిర్వహించిన బొడ్డెమ్మ అందరిని ఆకట్టుకుంది. బొడ్డెమ్మ 9 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, రెడ్డి సంక్షేమ సంఘం నాయకురాలు కంకణాల సరోజన, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.













