-ప్రధాన వక్తగా బేలా భాటియా హాజరు…
హుజురాబాద్/ అక్టోబర్ 10 (మా అక్షరం): మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 11న హుజురాబాద్లో నిర్వహించనున్న మానవ హక్కుల నేత బాలగోపాల్ 17వ సంస్మరణ సభను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ (హుజురాబాద్ క్లబ్)లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ హైకోర్టు న్యాయవాది, సామాజిక హక్కుల కార్యకర్త బేలా భాటియా ప్రధాన వక్తగా హాజరుకానున్నారు.‘నేటి సందర్భానికి బాలగోపాల్ హక్కుల దృక్పథం’ అనే అంశంపై సభలో చర్చించనున్నారు. బాలగోపాల్ ఆశయాలు, మానవ హక్కుల పరిరక్షణకు ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆలోచనల ప్రాధాన్యతను వివరించనున్నారు.ఈ సభకు ప్రజాస్వామికవాదులు, హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, సాహితీవేత్తలు, మేధావులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.ఈ మేరకు మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎస్. తిరుపతయ్య, న్యాయవాది, టీజేఎస్ రాష్ట్ర నాయకులు ముక్కెర రాజు, భారత్ బచావో నాయకులు భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం, రచయిత ఇమ్మడి సంపత్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు, డీటీఎఫ్ నాయకులు పి. ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు గుంటి సామ్రాజ్యం, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి అధ్యక్షుడు రామంచ భరత్, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య నాయకులు బాబ్జీ, ఆర్టీసీ నాయకులు శివదయాల్ సింగ్, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్ తదితరులు పిలుపునిచ్చారు.













