-అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన బాలగోపాల్…
హుజురాబాద్/ అక్టోబర్ 11 (మా అక్షరం): పట్టణంలో మానవ హక్కుల వేదిక, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నాయకుడు కె. బాలగోపాల్ 17వ సంస్మరణ సభను ఆదివారం పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ (హుజురాబాద్ క్లబ్)లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు అంబటి నాగయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కె. బాలగోపాల్ తన జీవితాంతం అణగారిన వర్గాల హక్కుల సాధనకు, పౌర హక్కుల పరిరక్షణకు అవిశ్రాంతంగా పోరాడారని కొనియాడారు. సమాజంలో అణచివేతకు గురవుతున్న ప్రజలకు న్యాయం జరిగేలా ఆయన నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.బాలగోపాల్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు.సమానత్వం, సామాజిక న్యాయం, పౌర హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఆవునూరు సమ్మయ్య, డాక్టర్ తిరుపతయ్య, న్యాయవాది ముక్కెర రాజు, జీవన్ కుమార్, రమాదేవి, వేల్పుల రత్నం, కాయిత రాములు, టీఎస్ సింగ్ తదితరులతో పాటు దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.













