-ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి…
-ప్రియాంక క్లినిక్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్ ఆకస్మిక తనిఖీ…
హుజురాబాద్/అక్టోబర్ 23 (మా అక్షరం):ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అవసరమైన అనుమతులు లేకుండా ప్రైవేట్ క్లినిక్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రభుదాస్ హెచ్చరించారు. ప్రతి ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకుడు తప్పనిసరిగా సంబంధిత శాఖ నుంచి అనుమతులు పొందడంతో పాటు, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని స్పష్టం చేశారు.ఈ క్రమంలో శుక్రవారం హుజురాబాద్‌లోని యూనియన్ బ్యాంకు దగ్గర గాంధీనగర్ రోడ్డులో ఉన్న ప్రియాంక క్లినిక్‌ను డాక్టర్ ప్రభుదాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అవసరమైన అర్హతలు, అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన నేపథ్యంలో, డాక్టర్ కుమార్ క్లినిక్ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి…
ప్రతి ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకుడు సంబంధిత చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వారు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని క్లినిక్‌లపై జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలను సీజ్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
అర్హత కలిగిన వైద్యులు, సిబ్బందే ఉండాలి…
కొత్తగా ప్రైవేట్ క్లినిక్‌లు ప్రారంభించేవారు వైద్యుల విద్యార్హత ధ్రువపత్రాలు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. క్లినిక్‌లలో పనిచేసే పారామెడికల్ సిబ్బంది కూడా తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి, నిబంధనల ప్రకారం అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు.
బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి…
జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రైవేట్ క్లినిక్‌ల నిర్వాహకులు బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా జిల్లా అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) సహా అవసరమైన పత్రాలను సమర్పించాలని తెలిపారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు, వైద్య రంగంలో నిబంధనల అమలు కోసం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన ఆదేశాలను ప్రతి ప్రైవేట్ క్లినిక్ నిర్వాహకుడు తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ ప్రభుదాస్ స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో జిల్లా ఆరోగ్య బోధకులు పంజాల ప్రతాప్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.













