-విందులు.. దావతులు.. ఆత్మీయ సమావేశాలు.. హుజురాబాద్‌లో హీటెక్కుతున్న క్లబ్ పాలిటిక్స్!…
హుజురాబాద్/నవంబర్ 02(మా అక్షరం): పట్టణంలో జరగనున్న హుజురాబాద్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో కనిపించే హడావుడి.. ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలు.. ప్రచారంలో పోటాపోటీ.. ఇలా క్లబ్ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 15న ఎన్నికలు జరగనుండటంతో ఆశావహులు తమదైన శైలిలో పావులు కదుపుతుండగా, క్లబ్ పరిధిలో ఎన్నికల సందడి రోజురోజుకూ పెరుగుతోంది.
పదవుల కోసం హోరాహోరీ.. సభ్యుల మద్దతు కోసం ప్రయత్నాలు!
హుజరాబాద్ క్లబ్ కార్యవర్గంలో కీలక పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా పోటీదారులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వ్యక్తిగత పరిచయాలు, స్నేహ సంబంధాలు, ఆత్మీయ పలకరింపులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సంప్రదింపులు.. మరోవైపు సమావేశాలు.. ఇంకోవైపు విందులు, దావతులతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఎవరికి వారు తమ విజయావకాశాలను అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
క్లబ్ ఎన్నికలా.. రాజకీయ సమరమా?
సాధారణంగా క్లబ్ ఎన్నికలు సభ్యుల మధ్య జరిగే అంతర్గత పోటీగానే ఉంటాయి. అయితే హుజురాబాద్ క్లబ్ ఎన్నికల చుట్టూ నెలకొన్న హడావుడి మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవుల కోసం జరుగుతున్న ఈ పోటీ కేవలం కార్యవర్గ ఎంపికకే పరిమితమా? లేక పట్టణంలో తమకున్న పరిచయాలు, పలుకుబడి, పరపతిని చాటుకునే వేదికగా మారిందా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది.ఎమ్మెల్యే ఎన్నికలను తలపించేలా సాగుతున్న ప్రచార పర్వం, సభ్యులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు క్లబ్ ఎన్నికలకు ప్రత్యేక ఆసక్తిని తీసుకొస్తున్నాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ నెల 15న ఉత్కంఠకు తెర!..
క్లబ్ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులే సమయం ఉండటంతో పోటీదారులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. సభ్యుల మద్దతు ఎవరికి లభిస్తుంది? కీలక పదవులను ఎవరు దక్కించుకుంటారు? కొత్త కార్యవర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుంది? అన్న ప్రశ్నలు ఆసక్తిని పెంచుతున్నాయి.మొత్తానికి హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు పట్టణంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ నెల 15న వెలువడనున్న ఎన్నికల ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి? కొత్త కార్యవర్గం క్లబ్ అభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది? అన్నది వేచి చూడాలి.













