-ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్న హుజురాబాద్ క్లబ్ పోరు!…
-విందులు.. దావతులు.. ఆత్మీయ సమావేశాలతో వేడెక్కిన వాతావరణం…
-13 పోస్టులకు 31 మంది అభ్యర్థులు.. కీలకంగా మారిన సెక్రటరీ పదవి.. 15న ఓటర్ల తీర్పు!…
హుజురాబాద్ / నవంబర్ 07 (మా అక్షరం):క్లబ్ ఎన్నికలు అంటే సాధారణంగా సభ్యుల మధ్య జరిగే చిన్నపాటి పోటీ.కానీ హుజురాబాద్ క్లబ్ ఎన్నికల తీరు చూస్తుంటే మాత్రం అసెంబ్లీ ఎన్నికలే గుర్తుకొస్తున్నాయి! ఎక్కడ చూసినా ఎన్నికల చర్చలు.. ఎవరిని కదిలించినా అభ్యర్థుల గురించే ప్రస్తావన. మరోవైపు విందులు, దావతులు, ఆత్మీయ సమావేశాలు, క్యాంపు రాజకీయాలతో హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు పట్టణంలో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. 13 కార్యవర్గ స్థానాలకు 31 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ రసవత్తరంగా మారింది. నవంబర్ 15న జరగనున్న పోలింగ్‌లో సభ్యులు ఎవరికి పట్టం కడతారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
ఒకప్పుడు సేవా వేదిక.. ఇప్పుడు ఎన్నికల రణరంగం!
హుజురాబాద్ క్లబ్‌కు పట్టణంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. రాజేశ్వర్ రావు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, మాజీ ఎంపీపీ జగన్నాథ్ నాయుడు తదితర ప్రముఖుల సహకారంతో క్లబ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. సభ్యులకు జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు సామాజిక కార్యక్రమాలకు కూడా వేదికగా నిలుస్తోంది.అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో క్లబ్లో పోటీ వాతావరణం నెలకొంది. తొలుత సాధారణ ఎన్నికలుగానే భావించినప్పటికీ, రోజులు గడిచేకొద్దీ పోటీ తీవ్రత పెరిగి ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.
13 పోస్టులు.. 31 మంది అభ్యర్థులు.. హోరాహోరీ పోరు!
క్లబ్ కార్యవర్గంలోని మొత్తం 13 స్థానాలకు 46 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 31 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 335 మంది సభ్యుల్లో 326 మందికి ఓటు హక్కు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రతి ఓటు కీలకంగా మారింది.ఒక్కో ఓటరును తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యులతో వ్యక్తిగత పరిచయాలు, ఆత్మీయ సమావేశాలు, విందులు, దావతులతో ప్రచారం సాగుతోంది. క్లబ్‌కు శాశ్వత అధ్యక్షుడిగా మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు కొనసాగుతున్నారు.
సెక్రటరీ పదవిపై సర్వత్రా ఉత్కంఠ!
ఈ ఎన్నికల్లో అందరి దృష్టి కీలకమైన కార్యదర్శి పదవిపైనే కేంద్రీకృతమైంది. ఈ పదవికి కట్కూరి మల్లారెడ్డి, ముచ్చ నారాయణరెడ్డి మధ్య పోటీ నెలకొంది. ఇద్దరికీ స్థానికంగా రాజకీయ, సామాజిక పరిచయాలు ఉండటంతో ఈ పోటీపై సభ్యుల్లో ఆసక్తి నెలకొంది.ఉపాధ్యక్ష పదవికి పుల్లూరి ప్రభాకర్ రావు, కంకణాల విజయరెడ్డి, గౌరు సమ్మిరెడ్డి పోటీలో ఉన్నారు.సంయుక్త కార్యదర్శి పదవికి మంద రమేష్ (ఆర్కే), శివనాధుని వేణు, కొమురవెల్లి హరిప్రసాద్ బరిలో నిలిచారు.కోశాధికారి పదవికి గర్రెపల్లి శ్రీను, కొండ గణేష్ మధ్య పోటీ నెలకొంది.
తొమ్మిది స్థానాలకు 21 మంది.. అసలు పోటీ ఇక్కడే!
తొమ్మిది కార్యవర్గ సభ్యుల స్థానాలకు ఏకంగా 21 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో ఈ స్థానాల్లోనూ పోటీ ఆసక్తికరంగా మారింది.
బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
కేసిరెడ్డి నర్సింహారెడ్డి, గడ్డం ధర్మారెడ్డి, మాగంటి శ్రీధర్, విష్ణుదాసు గోపాల్ రావు, మేకల రాజిరెడ్డి, నూక శ్రీనివాస్, బత్తుల సమ్మయ్య, జున్నోజు రాజేందర్, పోనుగంటి శ్రవణ్ కుమార్, గోలీ సురేష్, కోలే కల్యాణ్ రావు, దొనకొండ సత్యనారాయణరెడ్డి, జిల్లెళ్ల భాస్కర్ రెడ్డి, ఈదులకంటి రవీందర్ రెడ్డి, పుల్లూరి శ్రీకాంత్, అయ్యప్ప కొంరయ్య, వేముల మనోహర్, మొలుగురి సదయ్య, అకినపల్లి అనిల్, పలకల శ్రీనివాస్ రెడ్డి, ఎండీ మతీన్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఏకగ్రీవ ప్రయత్నాలకు బ్రేక్.. రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి!
క్లబ్ ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు పలువురు ప్రముఖులు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించకపోవడంతో ప్రత్యక్ష ఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు, ఎంపీ ఈటల రాజేందర్‌కు చెందిన రాజకీయ వర్గాల నాయకుల ఆసక్తి, జోక్యంపై పట్టణంలో చర్చ సాగుతోంది. తమకు పరిచయమున్న అభ్యర్థులు విజయం సాధిస్తే క్లబ్లో తమ ప్రభావాన్ని చాటుకునే అవకాశం ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది పోలింగ్ అనంతర పరిణామాలే స్పష్టం చేయనున్నాయి.
15న అసలు తీర్పు.. సభ్యుల నిర్ణయంపై ఉత్కంఠ!
ఇప్పటివరకు ప్రచారాలు, సమావేశాలు, వ్యూహాలతో సాగుతున్న ఈ ఎన్నికల సమరం నవంబర్ 15న కీలక మలుపు తిరగనుంది. అదే రోజు పోలింగ్ నిర్వహించి సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. 326 మంది ఓటర్లు వేసే ఓట్లు 13 మంది కార్యవర్గ సభ్యుల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.విందులు, దావతులు ప్రభావం చూపుతాయా? వ్యక్తిగత పరిచయాలు కీలకమవుతాయా? రాజకీయ వర్గాల ఆసక్తి ఎన్నికలపై ప్రభావం చూపుతుందా? లేక సభ్యులు తమకు నచ్చిన నాయకత్వానికే పట్టం కడతారా? అన్నది వేచి చూడాల్సిందే.మొత్తానికి.. హుజురాబాద్ క్లబ్ ఎన్నికలు ఇప్పుడు కేవలం క్లబ్ కార్యవర్గాన్ని ఎన్నుకునే ప్రక్రియకే పరిమితం కాకుండా పట్టణ రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 15న వెలువడే ఫలితాలు క్లబ్‌కు కొత్త కార్యవర్గాన్ని అందించడంతో పాటు స్థానికంగా నెలకొన్న రాజకీయ ఆసక్తికి కూడా తెరదించనున్నాయి!













