హుజూరాబాద్/ ఆగస్టు 03 (మా అక్షరం): అర్హులైన పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు కేటాయించకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే, లబ్ధిదారుల సమక్షంలోనే తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని 26వ వార్డు కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య సంచలన ప్రకటన చేశారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో), మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన ఆమె, తమ వార్డులో సొంత ఇల్లు లేని అనేక పేద కుటుంబాలు అద్దె ఇళ్లలో దుర్భర జీవితం గడుపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న కుటుంబాల అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వార్డు సభ నిర్వహించి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆమె కోరారు. పూర్వీకుల పేర్లపై ఉన్న ఆస్తులను చూపిస్తూ నిజమైన పేదలను అనర్హులుగా ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు.మున్సిపల్ రికార్డులు, రిజిస్ట్రేషన్ శాఖ, విద్యుత్ బిల్లులు తదితర ఆధారాలతో సమగ్ర విచారణ చేపట్టి నిజమైన అర్హులను గుర్తించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే దరఖాస్తుదారుల నుంచి అఫిడవిట్లు తీసుకుని, ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్లు తేలితే ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవచ్చని సూచించారు.ప్రజలు నాలుగు సార్లు తనను కౌన్సిలర్‌గా గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని పేర్కొన్న లావణ్య, “నిజమైన అర్హులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు రాకపోతే, లబ్ధిదారుల ముందే నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తాను” అని ప్రకటించడం ప్రజావాణి కార్యక్రమంలో చర్చనీయాంశమైంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఓడితేల ప్రణవ్ బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రోంటాల సుహాసినికి కూడా వినతిపత్రాల ప్రతులను అందజేశారు.













