-ఇసుక ధరలు, యూరియా, సాగునీరు, విద్యుత్‌పై అధికారులకు ఆదేశాలు…
హుజురాబాద్/ ఆగస్టు 06(మా అక్షరం): మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్‌లతో మండల అభివృద్ధిపై విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు.అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వ్యవసాయం, హార్టికల్చర్, మిషన్ భగీరథ,విద్య,వైద్యం, నీటిపారుదల,విద్యుత్, రెవెన్యూ,ఉపాధి హామీ, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరుపై శాఖల వారీగా సమీక్షించారు.మండలంలో ఇసుక కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్‌లు దృష్టికి తీసుకురావడంతో ఆర్డీవోతో ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రూ.1,500కు లభించాల్సిన ఇసుక రూ.7,500 వరకు విక్రయించడం బాధాకరమన్నారు.రైతులకు యాప్ ద్వారా కాకుండా ఎరువుల దుకాణాల వద్దనే యూరియా అందించే విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపి హుజురాబాద్ నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించాలని కోరారు. నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు ఇబ్బందులు కల్పిస్తే 29 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని తెలిపారు.మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి నిరంతర తాగునీరు అందేలా చూడాలని, పైప్‌లైన్ లీకేజీలను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, పౌష్టికాహారం, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.సమావేశంలో ఆర్డీవో,ఎంపీడీవో, తహసీల్దార్,వివిధ శాఖల అధికారులు,మండల సర్పంచ్‌లు పాల్గొన్నారు.













