-రిలే నిరాహార దీక్షలకు సీపీఐ, జేఏసీ నేతల మద్దతు…
హుజూరాబాద్ / ఆగస్టు 18 (మా అక్షరం):ప్రభుత్వ నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలపై కాంగ్రెస్ నేత గూడూరు స్వామిరెడ్డి వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ సీనియర్ నేత మర్రి వెంకటస్వామి, జేఏసీ నాయకుడు వంగల హనుమంత్ గౌడ్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల స్థలాల పరిరక్షణ కోసం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వారు జర్నలిస్టులకు సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల సమక్షంలో 120 గజాల చొప్పున స్థలాలు కేటాయించారని, ప్రభుత్వమే సర్వే నంబర్లు కేటాయించి ఇంటి నంబర్లు ఇచ్చిన తర్వాత జర్నలిస్టులు అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. అలాంటి వారిపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టత ఉన్నప్పటికీ అధికారులు సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు.బాధిత జర్నలిస్టులకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్‌బాబు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. లిఖితపూర్వక హామీ ఇవ్వకపోతే ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు, వివిధ సామాజిక సంఘాల నాయకులు, జమ్మికుంట జర్నలిస్టులు తదితరులు పాల్గొని జర్నలిస్టుల పోరాటానికి మద్దతు తెలిపారు.













