-బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి…
-ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి…
హుజురాబాద్/సెప్టెంబర్ 07 (మా అక్షరం): తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను హుజురాబాద్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత, కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జి మిడిదొడ్డి రాజు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తిని ప్రతి సభ్యుడు గౌరవించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతమైన స్పీకర్ పదవిలో ఉండటాన్ని ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. శాసనసభ, శాసనమండలి వంటి ప్రజాస్వామ్య వేదికల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రావు స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ దళిత సమాజం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్పీకర్ కుటుంబ సభ్యులు, తల్లిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడటం మహిళా సమాజానికే అవమానకరమని యేముల పుష్పలత అన్నారు. తాతా మధుసూదన్ రావు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు, తెలంగాణ దళిత సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలను,రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను అవమానించేలా మాట్లాడటం సరికాదని సందమల్ల నరేష్ అన్నారు. ప్రతిపక్ష నాయకులు విచక్షణ కోల్పోయి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు.తాతా మధుసూదన్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని మిడిదొడ్డి రాజు డిమాండ్ చేశారు. దళిత స్పీకర్‌పై అసహనాన్ని ఈ విధంగా వ్యక్తం చేయడం తగదని, దళితుల పట్ల చిన్నచూపు చూపించే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. దళిత సమాజం ఆత్మగౌరవాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.













