-టాప్రా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పిలుపు…
హుజూరాబాద్/ సెప్టెంబర్ 08 (మా అక్షరం): ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ పిలుపునిచ్చారు. పట్టణంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో యూనిట్ అధ్యక్షుడు భారత ప్రభాకర్ అధ్యక్షతన మహా ధర్నా సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జనార్ధన్, గౌరవాధ్యక్షుడు కట్ట నాగభూషణచారి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నూతన పీఆర్సీని జూలై 2023 నుంచి అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని, నూతన ఈహెచ్ఎస్ విధానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
గత నెల 27న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్లో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ నెల 10న హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో నిర్వహించనున్న మహా ధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశంలో టాప్రా హుజూరాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య, కోశాధికారి మండల వీరస్వామితో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.













