-పిల్లలు లోనికి వెళితే .. ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?…
-పట్టణంలోని ప్రమాదకర ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్, గేట్లు ఏర్పాటు చేయాలి: కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు…
హుజురాబాద్/సెప్టెంబర్ 08 (మా అక్షరం): హుజురాబాద్ క్లబ్‌ను ఆనుకొని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ప్రమాదం పొంచి ఉందని 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ విద్యుత్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ, లోపలికి వెళ్లే గేటు విరిగిపోవడంతో రక్షణ లేకుండా పోయిందన్నారు.గేటు విరిగి ఉండటంతో చిన్నారులు ఆడుకుంటూ ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్తున్నారని తెలిపారు. విద్యుత్ పరికరాలకు సమీపంలో పిల్లలు సంచరించడం అత్యంత ప్రమాదకరమని, ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ఆయన ప్రశ్నించారు. పట్టణంలో ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు మరికొన్ని ఉన్నాయని, వాటిని అధికారులు వెంటనే గుర్తించి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, గేట్లు అమర్చడంతో పాటు కంకర పోసి ప్రజలు, చిన్నారులు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రజల భద్రతకు సంబంధించిన అంశంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని కౌన్సిలర్ వర్ధినేని రవీందర్‌రావు డిమాండ్ చేశారు.













