-నిత్య ధూపదీప నైవేద్యాలకు నోచుకోని గణనాథుడు.. పురాతన ఆలయాన్ని పరిరక్షించాలని భక్తుల విజ్ఞప్తి…
హుజూరాబాద్/సెప్టెంబర్ 09 (మా అక్షరం): పట్టణంలోని రంగనాయకుల గుట్ట కింద వెలసిన స్వయంభూ వినాయకుడు నేటికీ నిర్లక్ష్యానికి గురవుతున్నాడని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో వందలాది వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నప్పటికీ,ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన రంగనాయకుల గుట్ట వినాయకుడికి కనీసం నిత్య ధూపదీప నైవేద్యాలు అందకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.వెయ్యేళ్ల చరిత్రకు ఆనవాళ్లుచారిత్రక ఆధారాల ప్రకారం రంగనాయకుల గుట్ట పరిసరాల్లోని పురాతన శిల్పాలు, నిర్మాణ ఆనవాళ్లు ఈ ప్రాంత ప్రాచీనతను తెలియజేస్తున్నాయి.ఈ వద్ద ఉన్న వినాయక విగ్రహం క్రీ.శ. 11 లేదా 12వ శతాబ్దానికి, అంటే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదిగా పేర్కొంటున్నారు.కొండరాతిని తొలిచి రూపొందించిన రాక్-కట్ శిల్పంగా కనిపించే ఈ వినాయక విగ్రహం ప్రత్యేకతను కలిగి ఉంది. నాలుగు చేతులతో, నాగు చుట్టుకుని, పెద్ద పొట్టతో ఉన్న వినాయక స్వరూపం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి పురాతన శిల్పాన్ని సంరక్షించడం ద్వారా హుజూరాబాద్ చారిత్రక వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని స్థానికులు చెబుతున్నారు.రంగనాయకుల గుట్ట చుట్టుపక్కల గతంలో పురాతన శిల్పాలు, మట్టి పాత్రలు తదితర చారిత్రక ఆనవాళ్లు లభించినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతపై మరింత శాస్త్రీయ పరిశోధన జరిపి, పురాతన ఆనవాళ్లను పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు.
నిత్య పూజలు జరిగేలా చూడాలి..
“హుజూరాబాద్‌లో వందలాది వినాయకులను ఏర్పాటు చేసుకుని పండుగలు జరుపుకుంటున్నాం. కానీ మన గుట్ట కింద స్వయంభువుగా వెలసిన ఇంతటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన వినాయకుడికి కనీసం ధూపదీప నైవేద్యాలు అందించే పరిస్థితి లేకపోవడం బాధాకరం. ఇకనైనా మనమంతా కలిసి ముందుకు వచ్చి గణనాథుడికి నిత్య పూజలు జరిగేలా చూడాలి”అని భక్తులు కోరుతున్నారు.పురాతన దేవాలయాలు, శిల్పాలు కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలు మాత్రమే కాకుండా మన చరిత్ర, సంస్కృతికి ప్రతీకలని, రంగనాయకుల గుట్ట వినాయకుడి ప్రదేశాన్ని అభివృద్ధి చేసి, సంరక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.“ఇంత గొప్ప చరిత్ర కలిగిన మన వినాయకుడిని విస్మరించడం ఎంతవరకు సబబు? పురాతన ఆలయాలను కాపాడుకుందాం.. మన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందిద్దాం” అని భక్తులు పిలుపునిస్తున్నారు.













