-బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన…
హుజూరాబాద్/సెప్టెంబర్ 10 (మా అక్షరం): రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో హుజూరాబాద్ మున్సిపల్ కార్మికులు గురువారం విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఎం.డి. అజ్జు, ప్రధాన కార్యదర్శి బోరగాల కుమార్ మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. వేతనాలు అందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యావసరాలు కొనుగోలు చేయలేక, పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేక కార్మికులు అప్పులపాలవుతున్నారని తెలిపారు. తక్షణమే బకాయి వేతనాలను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షురాలు రాసపల్లి సరోజన, నాయకులు రామగిరి సులోచన, వినోద్, కాంత్ కుమార్తో పాటు పారిశుధ్య, వాటర్ సప్లై, ఎలక్ట్రిషియన్, హరితహారం విభాగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.













