-గద్దర్ ఆశయాలను కొనసాగించాలి.. ఓటు హక్కుతోనే బహుజన విముక్తి….
-తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల…
హుజూరాబాద్ /సెప్టెంబర్ 10 (మా అక్షరం): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడమే నేటి తరానికి అసలైన ప్రజా యుద్ధమని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారానే బహుజనుల విముక్తి సాధ్యమవుతుందని ఆమె పిలుపునిచ్చారు.ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతిని పురస్కరించుకుని గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన సంస్మరణ సభలో డాక్టర్ వెన్నెల ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు.
పోరాటాలకు గద్దర్ జీవితం స్ఫూర్తి
తెలంగాణ ఉద్యమంలో ‘బండెనక బండి కట్టి’, ‘పొడుస్తున్న పొద్దు మీద’ వంటి విప్లవ గీతాలతో యావత్ తెలంగాణను కదిలించిన గద్దర్ ఆశయాలు చిరస్మరణీయమని డాక్టర్ వెన్నెల పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు పీడిత, అణగారిన వర్గాల కోసం గద్దర్ పోరాడారని గుర్తుచేశారు. రాబోయే తరాలకు రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతను ఒక మహత్తర ఉద్యమ స్ఫూర్తిగా అందించి వెళ్లారని అన్నారు.గద్దర్ జీవితాన్ని తీర్చిదిద్దడంలో, ఆయన పోరాట పయనంలో తల్లి విమలమ్మ చేసిన త్యాగం, పోరాట పటిమను డాక్టర్ వెన్నెల భావోద్వేగంతో ప్రస్తావించారు.
మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యం
బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన మహిళా సమానత్వం ఇంకా పూర్తిస్థాయిలో సాధించలేదని డాక్టర్ వెన్నెల అన్నారు. వేదికల నుంచి చట్టసభల వరకు మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు సామాన్య మహిళలు, చదువుకున్న యువత, ఆటో డ్రైవర్లు వంటి సామాన్యులు నాయకత్వ స్థానాల్లోకి వచ్చినప్పుడే నిజమైన ప్రజాస్వామ్య సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.అసెంబ్లీ, స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు, పదవుల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరించే తీరును ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
గద్దర్ గీతంతో ఉర్రూతలూగిన సభ..
సభ ముగింపులో గద్దర్ చివరిగా రచించిన ‘నా బానిసలారా లెండిరా… అడుక్కతింటే మన ఆకలి తీరదు…’ గీతాన్ని డాక్టర్ వెన్నెల స్వయంగా ఆలపించారు. ఆమె గానం సభికుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. గద్దర్ ఆశయాలు, పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని పలువురు నాయకులు, ఉద్యమకారులు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు, గద్దర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు.













