-యూటర్న్ వద్ద పొంచి ఉన్న ప్రమాదం..
హుజూరాబాద్/ సెప్టెంబర్ 11(మా అక్షరం): హుజూరాబాద్–జమ్మికుంట ప్రధాన రహదారిలోని ఎన్‌హెచ్‌ఐ బైపాస్ రోడ్డుపై ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివ ఫిల్లింగ్ స్టేషన్ సమీపంలోని యూటర్న్ వద్ద రోడ్డు పక్కనే విద్యుత్ స్తంభాలు ఉండటంతో వాహనాలు మలుపు తిరిగే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో యూటర్న్ తీసుకునే వాహనదారులకు స్తంభాలు ఇబ్బందికరంగా మారుతున్నాయని, అక్కడ సరైన స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని అంటున్నారు.ఇప్పటికే ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్‌అండ్‌బీ, విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలించి విద్యుత్ స్తంభాలను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పాటు అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.













