-తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్‌కుమార్…
హుజూరాబాద్ /సెప్టెంబర్ 12 (మా అక్షరం): రెండో విడత దళితబంధు నిధులను లబ్ధిదారులకు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు బండి అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రెండో విడత దళితబంధు కోసం రిలే దీక్షలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచే పైలట్ ప్రాజెక్టుగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుచేశారు. అయితే రెండో విడత నిధుల విషయంలో నియోజకవర్గ లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటివరకు దళితబంధు అందని అర్హులకూ వెంటనే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే రిలే దీక్షా శిబిరానికి వచ్చి తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్‌బాబు గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం రెండో విడత నిధులు ఎక్కడికీ వెళ్లలేదని చెబుతున్నారని, అలాంటప్పుడు వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు దళితులను మోసం చేయడం తప్ప న్యాయం చేయలేదని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే రెండో విడత దళితబంధు నిధులను విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని అశోక్‌కుమార్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుర్ర నటరాజ్, సురేష్, సంతోష్, సల్మా, రాజ్‌కుమార్‌తో పాటు సుమారు 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.













